కోట వినూత అక్రమ సంబంధం వల్లే హత్య చేసిందని ఎవరు చెప్పారు?... ఊర్లో పెళ్ళికి హడావిడిలా యూట్యూబర్ల తీరు
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినుత దంపతులు ఇప్పటికే డ్రైవర్ హత్య కేసులో అరెస్టయ్యారు. ఈ కేసును చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. పోలీసు విచారణలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలిసినప్పటికీ, నిజనిజాలన్నవి ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. కానీ అప్పుడే కొంతమందియూట్యూబర్లు కోటా వినుత ఆమె డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కు అక్రమ సంబంధం ఉందని, అందుకే అడ్డు తొలగించుకునేందుకే హత్య చేసిందని విచిత్రమైన వాదన తెరపైకి తీసుకువస్తున్నారు. ఒకవేళ తనతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని తానే ఎందుకు హత్య చేస్తుందన్న ప్రశ్నకు సదరు యూట్యూబర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఒకవేళ ఆమె భర్త మాత్రమే హత్యలో పాల్గొని ఉండి ఉంటే ఎంతో కొంత ఈ పసలేని వాదనకు బలం చేకూరి ఉండేది. కానీ భార్యాభర్తలిద్దరూ కలిసి తమ డ్రైవర్ ను హత్య చేయడం, ఆ తర్వాత శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేయడం పరిశీలిస్తే ఇదంతా మాత్రం అక్రమ సంబంధ కోణం కనిపించడం లేదని పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరును కూడా నిందితుడు కోట చంద్రబాబు జైలుకు వెళ్లే సమయంలో ప్రస్తావించడం పరిశీలిస్తే, ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం ఉండి ఉంటుందన్న వాదనలు లేకపోలేదు. ఏది ఏమైనా పోలీసుల విచారణలో నిజనిజాలు తేలకముందే సోషల్ మీడియాలో యూట్యూబర్లే న్యాయ నిర్ణేతల మాదిరిగా తీర్పులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.
About The Author
