మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర
నేరం జరిగిన ప్రదేశంలో నమూనాలను సేకరించి దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చు
సాంకేతికతతో ఇక నుండి సులభ తరం కానున్న కేసులు
నల్లగొండ(పెన్ కౌంటర్):-
జిల్లా క్లూస్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరితగతిన చేరుకొని, నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో, డిఎన్ఎ శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా, సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, ఎల్ఈడీ సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్రపరచి, ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయన్నారు. ఎప్పుడైన హత్యలు, మానభంగాలు, అనుమానస్పద మరణాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు, ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ, నేరదర్యాప్తు విషయంలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో ఉండడం వలన, నేర పరిశోధన సులభతరం అవుతుందన్నారు. ఈ మొబైల్ వాహనాల ఉపయోగం వల్ల దర్యాప్తు త్వరిగతన పూర్తి అవుతుందని, నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డిసిఆర్బి సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ క్లూస్ టీమ్ ఇంచార్జి ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
