మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు..
సురేంద్ర చారి కుటుంబానికి ఆర్థిక సహాయం.
మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):
చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని 2003 బ్యాచ్ మిత్రులు నిరూపించారు. తమతో కలిసి చదువుకుని, ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్న సురేంద్ర చారి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోయిన మిత్రులు, ఆయన మరణంతో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించారు. వెంటనే అందరూ ఏకమై తమ వంతు సహాయంగా చందాలు సేకరించి, ఆ మొత్తాన్ని నేరుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు సురేంద్ర చారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్న మిత్రుడి ఇంటికి వెళ్ళి ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా, నైతిక మద్దతును అందించిన పదవ తరగతి బ్యాచ్ మిత్రుల సామాజిక స్పృహను, వారి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చూసి వస్కుల గ్రామస్తులు, మిడ్జిల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏనాడో పాఠశాల విద్య ముగిసినా, నేటికీ అదే బంధాన్ని కొనసాగిస్తూ ఆపన్న హస్తం అందించిన ఈ స్నేహితుల బృందం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
స్నేహితులు రాజమల్లయ్య, బి.శ్రీను, డి.రవి, శ్రీను, రాజు, నవీన్, వినోద్, అరుణ్, ఆనంద్, ఎస్. రాఘవేందర్, కొండయ్య, నరసింహ, డి.రవి యాదవ్, రవి గౌడ్, ఎం.రాజు, కె.మధు, సి.పాండు, అంజి , బి. సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
